
హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి చికిత్సలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో దక్షిణ భారత దేశంలో నిమ్స్ నంబర్‌వన్‌గా నిలిచింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి చేసింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గుజరాత్‌లోని ఐకేడీఆర్సీ మొదటి స్థానంలో ఉండగా,
రెండో స్థానంలో లూథియానా క్రిస్టియన్ కాలేజీలో ఉంది. నిమ్స్ ఆసుపత్రి మూడో స్థానంలో నిలిచింది. 2,000 మందిలో 1,900 మంది (95 శాతం మంది) రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. 2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో 500 కిడ్నీ మార్పిడిలు చేసి నిమ్స్ ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. నిమ్స్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుతమైన పనితీరుతోనే రికార్డును సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందలు
నిమ్స్ వైద్య బృందం సాధించిన అరుదైన ఘనతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనూ అత్యాధునిక వైద్యం అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని నిమ్స్ మళ్లీ నిరూపిస్తోందని న్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి సేవలను మరింత విస్తరించి, పేదలకు ఉచితంగా అత్యాధునిక, ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల గాంధీ హాస్పిటల్‌లో 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యాధునిక వసతులతో
కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అలాగే, సనత్‌నగర్‌లోని టిమ్స్ హాస్పిటల్‌లో కూడా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ రంగంలోనే అత్యాధునిక అవయవ మార్పిడి సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.













