పరారీలో ఆరుగురు నిందితులు

రూ.10లక్షల విలువైన దగ్గు టానిక్, ట్యాబ్లెట్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన అదనపు సిపి శ్రీనివాస్

మనతెలంగాణ / సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసి ట్యాబ్లెట్లు, చోకో దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ స్పెషల్ క్రైం టీం, హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉండగా, రూ.10లక్షల విలువైన 77,700 టాబ్లెట్లు, 170 సిరప్ బిటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, మాంగర్‌బస్తీకి చెందిన మహ్మద్ సర్వర్ అలియాస్ రహీమ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, మహ్మద్ రబ్బానీ బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు, జమ్ము భాయ్, మహధారి, వీర్ధారి, ఇచ్ఛాధారి, అమన్ లాల్, బీదర్‌కు చెందిన కోహినూర్ కలిసి నిట్రాజోమ్ ట్యాబ్లెట్లు, చోకో కాఫ్ సిరప్‌లను నిల్వ చేస్తున్నారు.

మహ్మద్ సర్వర్, రబ్బానీని పోలీసులు అరెస్టు చేయగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్‌లోని తమకు తెలిసిన వారి వద్ద నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిట్రావెట్ టాబ్లెట్లు, కాఫ్ సిరప్‌లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎలాంటి అనుమతి లేకుండా అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యువకులు వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారు, ఇలా తీసుకున్న వారు నేరాలు చేయడంతో పాటు దాడులు చేస్తున్నారు.

ఇవి తీసుకున్న వారికి తీవ్రమైన నిద్రలేమి, తీవ్రమైన ఛాతి నొప్పి, రక్తనాళాల సడలింపు వంటివి చోటుచేసుకుంటాయి. కొన్ని రకాల ఫిట్స్ వ్యాధుల చికిత్సకు ట్యాబ్లెట్లు, సిరప్‌లను వైద్యుల పర్యవేక్షణలో వాడే మెడిసిన్. ఈ మందులను దుర్వినియోగం చేసినా లేదా అధికంగా సేవించినా మత్తు, తలతిరగడం, నిద్రమత్తు, గందరగోళం, శారీరక నియంత్రణ కోల్పోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. నిందితులు వీటిని అక్రమంగా నిల్వ చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు.