
గ్లాస్గో: స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అసాధారణ ఆటతో పతకాల పంట పండిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఓ స్వర్ణం మరో రజతం లభించింది. అంతేగాక పురుషుల లాంగ్ జంప్‌లో స్టార్ ఆటగాడు మురళీ శ్రీశంకర్ వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రాతో సహా మరో ఇద్దరు ఫైనల్‌కు చేరుకున్నారు. షాట్‌పుట్‌లో తజిందర్ పాల్ సింగ్, సమర్‌దీప్ సింగ్ గిల్‌లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. బాక్సింగ్‌లో భారత్‌కు ఇప్పటికే ఆరు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో పారా అథ్లెట్లు దిలీప్ మహాదు గావిత్, మహ్మద్ బాసిల్ అసాధారణ ఆటతో అదరగొట్టి స్వర్ణ, రజత పతకాలను సొంతం చేసుకున్నారు. దిలీప్ గావిత్, బాసిల్ అద్భుత ప్రతిభతో అదరగొట్టారు. దిలీప్ 10.71 సెకన్లలోనే రేసును పూర్తి చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బాసిల్ 10.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం దక్కించుకున్నాడు. ఒకే విభాగంలో ఇద్దరు భారత అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. గావిత్ సాధించిన పతకంతో ఈ క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య మూడుకు చేరింది. ఇంతకుముందు మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), పారా అథ్లెట్ షర్మిల షాట్‌పుట్‌లో పసిడి పతకాలు సాధించారు.
అదరగొట్టిన శ్రీశంకర్
పురుషుల లాంగ్‌జంప్‌లో భారత స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజత పతకాన్ని సాధించి ఔరా అనిపించాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బరిలోకి దిగిన శ్రీశంకర్ అసాధారణ పోరాట పటిమతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. కొన్ని రోజులుగా శ్రీశంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇలాంటి స్థితిలో అతను బరిలోకి దిగుతాడా లేదా అని అంశంపై సందిగ్ధం నెలకొంది. అయితే తీవ్ర ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను తట్టుకుంటూ బరిలోకి దిగిన శ్రీశంకర్ ఏకంగా వెండి పతకం సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. అతని అసాధారణ పోరాటానికి దేశం మొత్తం ఉప్పొంగి పోయింది. తీవ్ర పోటీ ఉండే లాంగ్ జంప్ వంటి క్రీడలో రజతం సాధించడం ద్వారా శ్రీశంకర్ దేశం గర్వ పడేలా చేశాడు.








