పెద్ద అంబర్‌పేట్‌లో పనిచేసే ఓ జూనియర్ అసిస్టెంట్‌ను అబ్ధుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు డిప్యూటేషన్‌పై పంపిస్తే ఆయన అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అబ్ధుల్లాపూర్‌మెట్‌లో పనిచేసే సబ్ రిజిస్ట్రార్ కు సహయంగా ఉంటారని ఉన్నతాధికారులు అక్కడకు డిప్యూటేషన్ పంపిస్తే నిషేధిత జాబితాలో ఉన్న భూములను, ప్రభుత్వ భూములకు బై నెంబర్‌లు వేసి ఈ జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

నల్లగొండలోని ఆర్‌ఓఓబి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే హవా ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్‌ల సమయంలో వారు చెప్పినంత ఇవ్వాల్సిందేనని ప్రైవేటు వ్యక్తులు డిమాండ్ చేస్తుండడంతో ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ జిల్లా డిఆర్ ఖమ్మం జిల్లాకు కూడా ఇన్‌చార్జీగా ఉండడం, ఆయనకు ప్రైవేటు వ్యవహారాలు ఎక్కువ కావడంతో సబ్ రిజిస్ట్రార్‌లు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.