డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కెమెరా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇన్ని కెమెరాలు ఉన్నా కూడా.. రియాన్ నిర్లక్ష్యంగా వేప్ చేసిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. దీంతో బిసిసిఐ రియాన్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అతడి మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో ఫీల్డ్ అంపైర్లు తన్మయ్ శ్రీవాత్సవ, నితిన్ మేనన్ నుంచి మ్యాచ్ రిఫరీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే సోషల్‌మీడియాలో ఒక్కసారిగా వీడియోలు వైరల్ కావడంతో ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనకు పాల్పడినట్లు తేల్చి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్‌ను పరాగ్ ఖాతాలో ఐపిఎల్ గవర్నింగ్ కమిటీ చేర్చినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.