ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేసినట్లు తన తప్పును అంగీకరించాడు. గత ఏప్రిల్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో అతడిని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా ఆ కేసును సిడ్నీ న్యాయస్థానం విచారించింది. నేరాన్ని వార్నర్ అంగీకరించినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ నేరుగా కోర్టుకు హాజరు కాలేదు. వాదనలు విన్న న్యాయస్థానం అతడిని దోషిగా తేలుస్తూ వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనుంది.

అసలేం జరిగిందంటే.. రోడ్డుపై బ్రీత్ టెస్టింగ్‌ను చూడగానే వార్నర్ తన వాహనాన్ని ఆపి పక్కనే పార్క్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేశారు. ఇందులో వార్నర్ పరిమితికి మించి మద్యం సేవించినట్లు రుజువు కావడంతో అతడిని అరెస్ట్ చేశారు.