
టీం ఇండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి సేవలను అభినందిస్తూ.. పలువురు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ‘12th ఫెయిల్’ హీరో విక్రాంత్ మాస్సే రహానేపై ప్రశంసలు కురిపిస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు.
‘‘అజింక్య రహానే.. మీరు ఈ జెర్సీని ధరించడం వల్ల భారత క్రికెట్ మరింత గొప్పగా మారింది. కొందరు ఆటగాళ్లు రికార్డులను సృష్టిస్తారు. మరికొందరు ప్రమాణాలను నెలకొల్పుతారు. మీరు రెండో జాబితాకు చెందుతారు. వ్యక్తిగతం కంటే జట్టు కోసమే ఆడారు. విజయాలను వినయంతో.. ఎదురుదెబ్బలను ప్రశాంతంగా, హుందాతనంతో స్వీకరించారు. మీ ప్రతిభతోపాటు వ్యక్తిత్వం కూడా స్పూర్తిదాయకమని మాకు గుర్తు చేశారు. రాహుల్ ద్రవిడ్‌కు మీరే అసలైన వారసుడిగా నిలిచారు. క్రికెట్ ప్రపంచం మీకు రుణపడి ఉండటానికి అదొక్క విషయం చాలు. ప్రచార ఆర్భాటలనే విలువలుగా భావించే ప్రస్తుత పరిస్థితుల్లో.. నిజమైన ప్రతిభకు పిఆర్ అవసరం లేదని నిరూపించారు. నిస్వార్థ సేవ, పట్టుదల, ఆటపట్ల మీకున్న అంకిత భావం తరతరాల పాటు గుర్తుండిపోతుంది. ధన్యవాదాలు జింక్స్’’ అని విక్రాంత్ పోస్ట్ పెట్టారు.











