నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ ఢిల్లీలో శాంతియుత పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మకంగా మారడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. సోమవారం సాయంత్రం సచివాలయం రాజీవ్ గాంధీ చౌక్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకూ కాగడాలతో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్ ఇతర నాయకులు కార్యకర్తలూ పాల్గొన్నారు. మంత్రులు కూడా కాగడాలు చేతపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నీట్ పరీక్షపై మౌనం వీడాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు శాంతియుత పార్లమెంటు మార్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడ హింసా పద్ధతి చేయలేదన్నారు. విద్యార్థులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం దుర్మార్గమని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రశ్నా పత్రాలు లీకేజ్ వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుత నిరసన ప్రదర్శన చేశామని ఆయన తెలిపారు.