
ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం కూలిపోయి ఏడుగురు మృతి చెందిన ఘటనలో భవనం యజమాని హరిరామ్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విసృ్తతంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. గురుగ్రామ్ సమీపంలోని భివాడి వద్ద ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.సత్య నికేతన్‌లోని ‘హాస్టల్ డేజ్’ పీజీ భవనం కూలిన 24 గంటలకు పైగా సమయం గడిచిన తర్వాత గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే ఆయనను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేసి, పాస్‌పోర్టు వివరాలను సేకరించారు. ఎల్‌ఓసీ జారీ చేసిన అనంతరం గుప్తా కోసం పలు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఆయన ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మూడు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించాయి. గుప్తాకు చెందిన సెక్టార్-23లోని ‘హరిరామ్ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్’ దుకాణానికి కూడా పోలీసులు వెళ్లారు. గత రెండు రోజులుగా ఆ దుకాణం మూసి ఉంది. స్థానికుల ప్రకారం..
గుప్తా సుమారు 15 ఏళ్లుగా ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలోని ప్రముఖ హార్డ్‌వేర్ వ్యాపారుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. గుప్తా కుటుంబానికి సెక్టార్-23, పాలమ్ విహార్‌లో పలు ఇళ్లు ఉన్నాయని ఇరుగుపొరుగు వారు తెలిపారు.దశాబ్దాల నాటి ఐదు అంతస్తుల భవనంలో బాలుర కోసం ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి కొనసాగుతోంది. ఆదివారం మరమ్మతు పనులు జరుగుతుండగానే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విద్యార్థులు అధికంగా నివసించే ప్రాంతం ఒక్కసారిగా విషాద ఘటనాస్థలిగా మారింది.ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఈ భవనం ఉంది. చుట్టుపక్కల మోతీలాల్ నెహ్రూ కాలేజ్, ఆత్మారామ్ సనాతన్ ధర్మ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ నివసిస్తూ, చదువుకుంటుండటంతో క్యాంపస్‌కు సమీపంలో పీజీ వసతి కోసం ఈ ప్రాంతం చాలాకాలంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
భవనం కూలిన ప్రాంతంలో సహాయక, గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ ఫైర్ సర్వీస్, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థతో పాటు ఇతర సంస్థల సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భవనం బేస్‌మెంట్‌లో కొద్దిరోజులుగా నీరు నిలిచిపోయిందని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల భవనం పునాది బలహీనపడి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. అయితే భవనం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది. ఈ విషాద ఘటన నేపథ్యంలో రద్దీగా ఉండే సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణాలు, భవనాల భద్రతపై
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో పలు నివాస భవనాలను పీజీ వసతులుగా మార్చినట్లు అధికారులు గుర్తించారు.నాలుగు అంతస్తులకు మించి ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే సీజ్ చేయాలని ఎంసీడీ ఆదేశించింది. బాధ్యులైన అధికారులు ఎవరైనా ఉన్నట్లు తేలితే వారిని వెంటనే విధుల నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కూలిపోయిన సత్య నికేతన్ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో ఐదు అంతస్తులతో నిర్మించారు. సుమారు 55 చదరపు గజాల స్థలంలో ఉన్న ఈ భవనం పునరావాస కాలనీలో ఉంది. అయితే అక్కడ తొలుత గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో అంతస్తు నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉండటం గమనార్హం.













