
జలమయమైన రోడ్లు, మోకాలి లోతు నీటిలో మునిగిన రద్దీ మార్కెట్లు, అంగుళం కూడా ముందుకు కదలని వాహనాలు, ఇవన్నీ మంగళవారం ఎడతెగని వానలతో తడిసి ముద్దయిన ఢిల్లీలో కనిపిస్తున్నాయి. దీంతో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో నగరంలో కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం ఎడతెరిపి లేని వానతో కన్నాట్ ప్లేస్, జనపథ్, లూటెన్స్ ఢిల్లీ,భారత్ మండపం రోడ్, బారఖంబరోడ్, ఐటిఒ సమీపాన మధుర రోడ్, కాళింది కుంజ్, తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో జలమయం అయిన దృశ్యాలను పిడబ్లుడి మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ఎక్స్ ఖాతాలోని వీడియో ద్వారా చూపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూడా ఎక్స్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేశారు.
సదర్ బజార్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఛాతీ లోతు లోంచి స్కూలు పిల్లలు మునిగి దాటుతుండడం కనిపించింది. గ్రేటర్ కైలాష్ 2 నుంచి సావిత్రి సినిమా , అక్కడ నుంచి చిరాగ్ దిల్లీ, హౌజ్ ఖాస్,ఆర్‌కె పురం, సంగం విహార్ నుంచి ఖాన్పూర్, ఎంబీ రోడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శంకర్ విహార్, జకీర్ హుస్సేన్ రోడ్డు, ఢిల్లీ కంట్ నరైనా ఫ్లైవోవర్, మయపురి, ఐటిఒ , ఓల్డ్ రోహ్‌తక్ రోడ్డు మధుబన్ చౌక్, పీరాగర్హి, ఎయిమ్స్ సమీపాన ఎన్‌హెచ్ 48, ఢిల్లీ నొయిడా రోడ్, కాళింది కుంజ్, వికాస్ మార్గ్, తదితర రోడ్లన్నీ ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతున్నాయి. ఉదయం 11.30 2.30 గంటల మధ్య పూసా ప్రాంతంలో అత్యథికంగా 80 మిమీ వర్షపాతం నమోదైంది. జనక్‌పురి వద్ద 72 మిమీ, లోడి రోడ్ వద్ద 63.4 మిమీ, ఛాతర్‌పూర్ వద్ద 57.5 మిమీ, సఫ్దర్‌జంగ్‌వద్ద 51 మిమీ, ఆయా నగర్ వద్ద 50.1 మిమీ, నారాయణ వద్ద 44 మిమీ, జఫర్‌పూర్ వద్ద 8 మిమీ, వర్షపాతం నమోదైంది.











