భారత రక్షణ రంగాన్ని స్వావలంబన దిశగా నడిపించిన ప్రముఖ శాస్త్రవేత్త, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జీ. సతీశ్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘ఎమెస్కో డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ చేంజ్‌మేకర్-2026’ అవార్డు ప్రదానం చేశారు. జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఆదివారం జరిగిన వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి ఈ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్‌ సతీశ్‌రెడ్డి.. భారత రక్షణ రంగం ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతోందని, త్వరలోనే దేశం గ్లోబల్‌ సూపర్‌పవర్‌గా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకప్పుడు 100 శాతం ఆయుధ దిగుమతులపై ఆధారపడిన భారత్‌.. ప్రస్తుతం 70 శాతానికి పైగా ఆయుధాలను స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేస్తోందని తెలిపారు.

భారత్‌ అభివృద్ధి చేసిన ఆధునిక క్షిపణి వ్యవస్థలు శాటిలైట్‌ ఆధారిత సాంకేతికతతో సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ఒకే క్షిపణి ఒకేసారి మూడు వేర్వేరు లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక సాంకేతికతను దేశం అభివృద్ధి చేసిందని వివరించారు. ఈ రంగంలో భారత్‌ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన నిలిచిందన్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 వేల పరిశ్రమలు రక్షణ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్నాయని, ఇది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యానికి నిదర్శనమని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

తనకు లభించిన ఈ అవార్డును డీఆర్‌డీవోలో దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న వేలాది మంది శాస్త్రవేత్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తన ప్రయాణం, విజయాలను ప్రతిబింబించే పుస్తకాన్ని ఎమెస్కో విజయ్‌కుమార్‌, మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు.

కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. నరసింహ, ఏపీ మంత్రి సత్యప్రసాద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రాంచందర్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కే. రామచంద్రమూర్తి, జయా పట్టాభిరామ్‌, ఎమెస్కో విజయ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.