ఆర్‌టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్‌టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు.

తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్‌టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.