
న్యూఢిల్లీ: గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గదని, అటువంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 22, 2025న ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
"గత ఏడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుండి కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రకమైన ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు" అని ప్రధాని పేర్కొన్నారు
కాగా, గత ఏడాది ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, ప్రతీకారం తీర్చుకునేందుకు.. మే 7న భారత్ సైనిక చర్యను ప్రారంభించి, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది.













