మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివే స్తూ జీఓ 31లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ మే 1వ తేదీ నుంచి మే 31, 2026 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1, 2026 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది. అయితే, నా లుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మూడు రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుంచి రిలీ వ్ కావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హె చ్చరించింది. సెన్సస్ (జనగణన) విధుల్లో ఉన్న ఉ ద్యోగులకు బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ఆ ర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఈ జీఓలో పేర్కొన్నారు.

అదేవిధంగా 31-.12-.2025 నాటికి ఒకే చోట నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే  నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, రిటైర్‌మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-.05-.2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు. మే 31, 2027 లోపు పదవీ విరమణ చేయనున్న ఉ ద్యోగులు కోరుకుంటేనే బదిలీ చేయాలని ఈ జీఓ లో పేర్కొన్నారు. జీవిత భాగస్వామి (స్పౌస్) కేసు ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేళ్ల నిబంధన వర్తించదని ఈ జీఓలో స్పష్టం చేశారు. ఏ ఒక్క కేడర్‌లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని ఆర్థికశాఖ సూచించింది.


బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్/వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. భార్యాభర్తల కేటగిరీలో మూడేళ్ల నిబంధన వర్తించదని ప్రభుత్వం ఈ జీఓలో పేర్కొంది. అలాగే బదిలీల సమయంలో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి కేడర్ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ జీఓలో స్పష్టం చేసింది. స్టేట్, మల్టీ-జోనల్/జోనల్, జిల్లా స్థాయిల్లో అధికారుల నేతృత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి. విద్యాశాఖ, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్‌లు, రవాణా, అటవీశాఖలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

బదిలీ షెడ్యూల్ వివరాలు ఇలా..

మే 1 వ తేదీ నుంచి- 7వ తేదీ వరకు: ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. దీంతోపాటు బదిలీల విధి, విధానాల ఖరారు చేయడంతో పాటు ఖాళీ పోస్టులు, తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి దానిని ప్రచురించాలి.

మే 8-వ తేదీ నుంచి 15వ తేదీ వరకు: ఉద్యోగులు తమకు కావలసిన బదిలీ ప్రాంతాల కోసం ఆప్షన్లను సమర్పించాల్సి ఉంటుంది.

మే 16-వ తేదీ నుంచి 24వ తేదీ వరకు: దరఖాస్తులను పరిశీలించి బదిలీ విధానం ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలి. అనంతరం మాస్టర్ జాబితాను సిద్ధం చేయాలి.

మే 25-వ తేదీ నుంచి 31వ తేదీ వరకు: బదిలీ ఉత్తర్వులను జారీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకుల కృతజ్ఞతలు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల జిఓను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓతో సహనంతో ఎదురుచూస్తున్న వేలాది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం సంతృప్తిని కలిగించిందని టిజిఈజేఏసీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఈ జీఓతో ప్రభుత్వ పాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఉద్యోగుల అసలు సమస్యలను అర్థం చేసుకుని సముచిత నిర్ణయం తీసుకున్నందుకు తాము రుణపడి ఉంటామని వారు తెలిపారు.