హైదరాబాద్: టీ20 క్రికెట్ లో టీమిండియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో అభిషేక్ నాలుగోసారి 130+ స్కోరును నమోదు చేశాడు. దీంతో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో గేల్, ఫించ్ లు చెరో మూడుసార్లు 130 పరుగుల మార్కును దాటారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 68 బంతుల్లో10 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 135 పరుగులు చేశాడు. అభిషేక్ తన కెరీర్‌లో కేవలం 188 మ్యాచ్‌లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి, సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఇక, ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.