
కుత్బుల్లాపూర్: అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సు రవాణా పూర్తిగా స్థంభించింది. జీడిమెట్ల డిపో లో ఉన్న 139 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జీడిమెట్ల డిపో కు చెందిన 700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తరువాతే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, తమ సమస్యలను వివరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.













