అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని రేవంత్ గుర్తుచేశారు. ఈ దుఃఖ సమయంలో నాదెండ్ల గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల కుటుంబ సభ్యులకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఎపికి 11వ సిఎంగా నాదెండ్ల పనిచేశారు.