ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. "తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. "ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు" అని ఆరోపించారు.

"రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి?" అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.