గతంలో కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి కలిసి పెట్టాలని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేపిస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించడం కేంద్ర హోం శాఖ మంత్రి పరిథిలోకే వస్తుందని, అయినా బండి సంజయ్ మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందన్న బిజెపి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు.