గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌తో

పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్‌ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా కేసు సుప్రీం కోర్టులో ఉన్నదని గవర్నర్ సలహాదారుల సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది.


మరోసారి మంత్రిగా ప్రమాణం..

మంత్రి అజర్ పదవీ కాలం గడువు ఈ నెలాఖరుతో ముగియగానే ఆయన ‘మాజీ’ అయితే మైనారిటీలంతా అసంతృప్తికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అజర్ మాజీ కాగానే ఒక రోజు విరామం ఇచ్చి ఆ మర్నాడు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి అవకాశం ఉంది. ఈ మార్గాన్నే ముఖ్యమంత్రి అనుసరిస్తారా? ఆని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆ విధంగా రెండో సారి అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్లీ ఆరు నెలల వరకూ గడువు ఉంటుంది.