
నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ దినపత్రికలను తిరగేసేవారికి రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదేమో అనిపించకమానదు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేంతవరకూ ప్రాణాలకు హామీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏవైపునుంచి ఏ వాహనం మీదకు దూసుకువస్తుందో, ఏ మూలమలుపులో మృత్యుదేవత మాటువేసుకుని కూర్చుందో తెలియదు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ సమీపాన ఓ బస్సు లోయలో పడి, 21 మంది కన్నుమూసిన ఘటన దిగ్భ్రాంతికరం. కొండప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా మూలమలుపు వద్ద దారి కనబడకపోవడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ప్రమాదం జరిగాక మృతుల బంధువులకు మిగిలేది తీరని శోకమే. ప్రమాదం మిగిల్చిన అవకరాలతో క్షతగాత్రులు జీవితాంతం దీనంగా బతుకు ఈడ్వవలసిందే. ప్రభుత్వాలు అప్పటికప్పుడు లక్షల్లో నష్టపరిహారాలను ప్రకటించవచ్చుగాక, అవేవీ కోల్పోయిన తమ బంధువులను తిరిగి తీసుకురావడానికి ఎంతమాత్రం సహాయపడవు కదా. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చోదకుల నిర్లక్ష్యం, పరిమితికి మించి అతివేగంగా నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన హేతువులు కాగా, వాహనాలలోని సాంకేతిక లోపాలు సైతం పదుల సంఖ్యలో ప్రాణాలను కబళిస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.
స్లీపర్ బస్సులలో ఉన్నపళంగా మంటలు చెలరేగి, అందులో ఉన్న ప్రయాణికులు సజీవంగా ఆహుతి అవుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి రాత్రివేళ బయల్దేరిన ఓ ప్రవేటు బస్సు, బయల్దేరి నాలుగు కిలోమీటర్లు దాటిందో లేదో మంటల్లో చిక్కుకోవడం ఈ తరహా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయనడానికి నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు గల కారణాలపై నిపుణులతో అధ్యయనం జరిపించాలన్న ఆలోచన, ఒకవేళ అధ్యయనాలు జరిగినా వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లోపిస్తున్నాయి. ప్రపంచంలోని వాహనాలలో భారతదేశంలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్యలో మాత్రం మన దేశం అగ్రస్థానంలో ఉండటం శోచనీయం. ఏటా భారతదేశంలో 4.8 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే, అందులో లక్షా డబ్భైవేలమంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారట. దేశంలో సగటున రోజూ 474 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలోనే.
కానీ, ఇక్కడ జాతీయ, ప్రధాన రహదారులలో అనేక లోపాలు ఉన్నాయని, బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన చోట్ల కూడా మరమ్మతులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రే స్వయంగా పార్లమెంటులో ఆ మధ్య వాపోవడం మన రహదారుల దుస్థితికి అద్దం పడుతోంది. రోడ్డు ప్రమాదాలపై సందర్భం వచ్చినప్పుడల్లా సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెడుతూనే ఉన్నా, అవేవీ పాలకుల చెవికి ఎక్కడం లేదు. రాజస్థాన్ లోని ఫలోడి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ప్రమాదాలకు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రెండు రోజుల క్రితమే ప్రకటించింది. సురక్షితమైన రహదారి ప్రయాణం రాజ్యాంగంలోని జీవించే హక్కు (ఆర్టికిల్ 21) లో అంతర్భాగమని, ప్రమాద రహిత ప్రయాణం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పాలనాపరమైన నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలే ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో రహదారి భద్రతను రాజ్యంగాబద్ధమైన బాధ్యతగా పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.
నిర్దేశిత ప్రాంతాల్లో మినహా భారీ వాహనాలను జాతీయ రహదారులపై ఎక్కడబడితే అక్కడ నిలపకూడదని, రియల్ టైమ్ అలెర్టులు, జిపిఎస్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, ఇ- చలాన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో జాతీయ రహదారులు ఉన్న చోట జిల్లాస్థాయిలో రహదారి భద్రత టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలను శిరోధార్యంగా భావించి, అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రమాదం జరిగినప్పుడల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోగానే సరిపోదని గుర్తించాలి.














