హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్‌(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.