
తెలంగాణలో అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి సమ్మెకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న టీజి ఆర్టీసి జెఎసి స్పష్టం చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అయ్యాయి. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద నిరసనకు దిగిన కార్మికులకు మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసనలో పాల్గొన్నారు.

మరోవైపు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.ఇక, ఆర్టీసీ యాజమాన్యం.. యథావిధిగా అద్దె బస్సులు నడుపుతోంది.













