
బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన రమణి నరేష్ (25) అనే యువకుడు మాయమాటలు చెప్పి సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం బాలిక తీవ్ర భయాందోళనకు గురై ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు వెంటనే బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తన సిబ్బందితో వెంటనే గ్రామానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నిందితుడు రమణి నరేష్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఘటన విషయం ఆ గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













