
బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో మంతనాలు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నప్పటికీ, బిజెపి రాష్ట్ర నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఏమిటీ ?, పార్టీ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి ? వంటి ప్రశ్నలను కేంద్ర మంత్రి అమిత్ షా కురిపిస్తే, వాటికి సరైన సమాధానం చెబుతూనే లిఖితపూర్వకంగా ఓ నివేదిక ఇచ్చేందుకు ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 26న అమిత్ షా మధ్యాహ్నం 12.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి 1.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బిఎస్‌ఎఫ్‌కు చెందిన హెలికాప్టర్‌లో కరీంనగర్ చేరుకుని, అక్కడ ప్రతిమా విద్యా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి 3.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్‌లో బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులతో కొంత సేపు మంతనాలు జరుపుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.











