అమరావతి: స్వర్ణాంధ్రకు విజన్ కు కీలకమైన రోజు అని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టం అని అన్నారు. ఈ సందర్భంగా భోగాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ రెండు రికార్డులు సృష్టించామని, ఒకటి ఎయిర్ పోర్టు అని రెండు థింసా డ్యాన్స్ అని పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కారం తెలియజేశారు. ఇవాళ రూ. 18 వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను శ్రీకారం చుట్టామని, ఈ ప్రాజెక్టులు ఎపిని శరవేగంగా, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని మోడీ పేర్కొన్నారు. గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని అంకితం చేశారని, 13 వేల మందకి పైగా గిరిజన పిల్లల ఉత్సాహం చూస్తే ముచ్చటేసిందని, ఇది అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల అని కొనియాడారు.

ఎయిర్ పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదని, అయోధ్య ఎయిర్ పోర్టుకు వాల్మీకి, ఇక్కడ అల్లూరి పేరును పెట్టుకున్నామని అన్నారు. ఇదే భూమిపై ఇవాళ అభివృద్ధి ల్యాంచ్ ప్యాడ్ ప్రారంభమైందని, 2014 కంటే ముందు 74 ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 166 ఎయిర్ పోర్టులకు చేరుకుందని, ప్రయాణికులు సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేశామని అన్నారు. విమానం ఎక్కాలన్న పేద, మధ్యతరగతి వర్గాల కలలు సాకారం చేశామని, చిన్న పట్టణాల నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయని, ఉడాన్ ద్వారా విమానయానరంగంలో పెనుమార్పులు వచ్చాయని మోడీ స్పష్టం చేశారు.