న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా చేపట్టిన రాకెట్ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించినట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే ఉన్న యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి చెందిందని, ‘56 ఏళ్ల యువకుడికి చెందినది కాదు’ అని వ్యంగ్యంగా అన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సంప్రదాయ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ.. దేశ యువత అంతరిక్ష రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. స్కైరూట్ స్టార్టప్‌లో పనిచేస్తున్న బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని తనకు తెలియజేశారని చెప్పారు. అలాంటి యువతే ఈ ఘనతను సాధించిందని, తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని నేరుగా రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మోదీ స్కైరూట్ విజయాన్ని ప్రస్తావిస్తూ .. ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే ప్రైవేట్ రంగం ఇలాంటి విజయాలను నమోదు చేస్తోందన్నారు. భారత యువత సామర్థ్యం, ఆశయాలు అంతరిక్షం అంత విశాలంగా ఉన్నాయని ఈ విజయం ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరుగుతోందని, దీనికి ఈ విజయం మరో నిదర్శనమని చెప్పారు. గత నెల రోజుల్లో దేశం అనేక కీలక విజయాలను సాధించిందని ప్రధాని తెలిపారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై, ఇప్పుడు అంతరిక్ష రంగంలో కూడా భారత్ గర్వించదగ్గ విజయాలను నమోదు చేసిందన్నారు. ఈ విజయాలన్నీ ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపాయని చెప్పారు. ఈ ఘనత వెనుక భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, కార్మికుల సమిష్టి కృషి ఉందని ప్రధాని కొనియాడారు. దేశాభివృద్ధి లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

సంస్కరణల ద్వారా ప్రభుత్వం కల్పించిన అనుకూల వాతావరణమే యువ ఆవిష్కర్తలకు ధైర్యాన్ని, అవకాశాలను అందించిందని మోదీ అన్నారు. దేశం ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఎక్కిన ఫలితంగానే యువత ప్రపంచస్థాయి విజయాలను సాధిస్తున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లో భారీ చమురు శుద్ధి కర్మాగారాన్ని దేశానికి అంకితం చేసినట్లు, దేశంలోని మూడో సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ప్రధాని గుర్తుచేశారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్, అత్యంత పొడవైన రేక్‌తో కూడిన గ్రీన్ హైడ్రోజన్ రైలును భారత్ ప్రవేశపెట్టిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని, అభివృద్ధి పట్ల ఉన్న సంకల్పాన్ని ఈ విజయాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్న సమయంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని ఆయన కోరారు.