కైరో: ఇరాన్‌అమెరికా మధ్య జరుగుతున్న గల్ఫ్ యుద్ధం ఈజిప్ట్‌కు విస్తరించింది. ఈజిప్టులోని డమియెట్టా పోర్ట్‌లోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్‌పై బుధవారం డ్రోన్ దాడి జరగడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది వెంటనే నిర్ధారణ కానప్పటికీ, ఈ దాడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, అయితే డ్రోన్ దాడి జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఈజిప్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో ఇంతకాలం ఇరాన్, గల్ఫ్ దేశాలకు పరిమితమైన యుద్ధం మరో టర్న్ తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. పర్యవసానంగా అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు గురువారంనాడు ఇరాన్‌పై అమెరికా శక్తివంతమైన దాడులతో విరుచుకుపడింది. ఖెష్మ్ ద్వీపంలోని గృహసముదాయంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి

చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు టెహ్రాన్ ధ్రువీకరించింది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బుధవారంనాడు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో శక్తివంతమైన దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే దక్షిణ ఇరాన్‌లో శక్తివంతమైన పేలుళ్లు వినిపించాయి. ఖేష్మ్ ద్వీపం, అణువిద్యుత్ కేంద్ర కలిగిన తీరనగరం బెషెహర్‌ను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిపినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ‘హేవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టాయి. దీంత ఇప్పటి వరకూ అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.