మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా(బి కేటగిరీ)లో కోటా సీట్ల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో లేనట్లుగానే తెలుస్తోంది. ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ సారి ఆన్‌లైన్ విధానం అమలులోకి తీసుకురావాలని భావించినప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎ లాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఏటా బి కే టగిరీ సీట్ల భర్తీ విషయంలో అనేక ఫిర్యాదు అందుతు న్న నేపథ్యంలో దీనికి ఉన్నత విద్యామండలి శాశ్వత వి ధానాన్ని రూపొందించింది. ఈ మేరకు యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో విధానంలో భర్తీకి సంబంధించిన విధివిధానాల ప్రతిపాదనలు రూపొందించి ఉన్న త విద్యామండలి ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి కూడా పాత విధానంలోనే ఇంజనీరిం గ్ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంబిబిఎస్ తరహాలో ఎ,బి,సి కేటగిరీలుగా వి భజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రి య చేపట్టే అంశాన్ని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది.దేశవ్యాప్తంగా ఎం బిబిఎస్‌లో బి, సి కేటగిరీ సీట్లకు ఫీజును నిర్ణయించి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్ల కూడా ఎంబిబిఎస్ తరహాలోనే భర్తీ చేయాలని ప్రతిపాదించింది.

రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో 70 శాతం కన్వీనర్ కో టా ఇంజనీరింగ్ సీట్లను మెరిట్, రిజర్వేషన్ ఆధారం గా కౌన్సెలింగ్ విధానంలో ప్రభుత్వం భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం బి కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. అందులో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ విభాగం సీట్లను జెఇఇ మెయిన్ లేదా ఎప్‌సెట్ ర్యాంకు లేదా ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాటికి కూడా ప్రభు త్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వ సూలు చేయాలి. కానీ అందుకు భిన్నంగా మెరిట్‌ను ప ట్టించుకోకుండా, ఎక్కువ చెల్లించేందుకు ఎవరు ముం దుకొస్తే వారికే యాజమాన్యాలు అమ్ముకుంటున్నట్టు గా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. తాము మాట్లాడుకున్న ఫీజు వివరాలు బయటకి చెబితే సీటు పోతుందేమో అని తల్లిదండ్రులు కూడా మేనేజ్‌మెంట్ కోటా ఫీజు విషయాల గురించి ఎవరితో మాట్లాడటం లేదు. వారికి పరిచయం ఉన్న కన్సల్టేన్సీలు, యాజమాన్యాలతో నేరుగా బేరసారాలు జరిపి సీటు ఖరారు చేసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని కాలేజీ యాజమాన్యాలైతే కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ ప్రాతిపదికన సీట్లు అమ్ముకుంటున్నట్లు తెలిసింది.

ఏటా రూ.కోట్ల రూపాయల వసూళ్లు దందా

రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, అందులో 20 వేలకుపైగా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అమ్ముకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వద్ద సమాచారం ఉన్నట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు గరిష్ఠంగా ఏడాదికి 5 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా అంతకు రెట్టింపు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సగటున ఒక్కో సీటు రూ.5 లక్షలకు అమ్ముకున్నా యాజమాన్యాలు కోట్లలో దండుకుంటున్నాయని అంచనా.

మరోవైపు సీట్ల అమ్మకం వ్యవహారంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఏటా ఉన్నత విద్యా మండలి అధికారులకు ఫిర్యాదులు చేయడంతోపాటు ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసు బందోబస్తు కూడా నిర్వహించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తమకు తక్కువ మొత్తానికి సీట్లు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆఫీసుల్లో తిష్ట వేస్తున్నారని ఉన్నతాధికారులే చెబుతున్నారు. దీనిని అరికట్టేందుకు పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లు భర్తీ చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.