
ఎల్‌ఆర్‌ఎస్ గడువు మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీల్లో 25శాతం రాయితీ గడువును 30 నవంబర్ వరకు పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 1మే నుంచి 31జూలై వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఓటర్లకు సంబంధించిన స్పెషల్ ఇన్ టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. అయితే, గతేడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ 31మార్చి 2026 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
మూడు సార్లు గడువు పొడిగించినా ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఎస్‌ఐఆర్ కారణంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం కావడంతో మరో నాలుగు నెలలపాటు 1ఆగస్టు నుంచి 30నవంబర్ వరకు గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు దరఖాస్తుదారులు కూడా ఆశించిన స్థాయిలో ఫీజులు చెల్లించకపోవడంతో పాటు ఫీజు చెల్లించిన దరఖాస్తులకు కూడా సకాలంలో ప్రొసిడింగ్స్ ఇవ్వలేకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువును పెంచాలని నిర్ణయించింది. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజు రూపంలో ప్రభుత్వం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం కూడా రాకపోవడం విశేషం.











