
మరింత బలపడే అవకాశాలు
అప్రమత్తతో గట్టెక్కవచ్చు
అల్పపీడన ద్రోణి దిశ మార్చుకోవడం వల్లే ఇటీవల రాష్ట్రంలో వర్షాలు కురిశాయి
ఆశలన్నీ ఇండో ఓషన్ డైపోల్ మీదనే
‘మన తెలంగాణ’తో హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నడింపల్లి రాఘవేంద్రరాజు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు త్వరగా త గ్గేవి కావని, ఎల్ నినో ఎప్పుడూ సుదీర్ఘంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైంటిస్ట్-డి నడింపల్లి రాఘవేంద్ర రాజు అన్నారు. సోమవారం ఆయన మన తెలంగాణతో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులపై మాట్లాడారు. ఇటీవల ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షాలతో ఎల్‌నినో ముప్పు తొలగిపోలేదని, ఇది ఇంకా కొనసాగుతుందని, ఎల్‌నినో ప్రస్తుతం మధ్యస్థ స్థాయిలో ఉందని, మరింత బలపడే అవకాశాలే కనిస్తున్నాయని తెలిపారు. గత నెలో 22 రోజులు అల్పపీడన పరిస్థితులు ఉన్నా వార్షాలు తక్కువ రోజులే కురవడం ఈ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గాలులు ప్రభావంతో రాష్ట్రంలో గత ఐదు రోజులు విస్తారంగా కురిశాయని, విదర్భ, ఉత్తర చత్తీస్‌గడ్‌లో ఏర్పడిన ద్రోణి దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో కురిసన వర్షాలతో లోటు నుంచి ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. సాధారణంగా ఎల్‌నినో ఏర్పడితే 60 శాతం వర్షాలు తగ్గిపోతాయని, అయితే ఇది వర్షాబావ పరిస్థితులను సూచిస్తున్నా, కరువుగా భావించలేమని చెప్పారు. ఎల్‌నినోలు సాధారణంగా ఏర్పడుతుంటాయని అయితే వాటి తీవ్రతను బట్టి వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 1970 నుంచి దేశంలో 22 ఎల్‌నినోలు ఏర్పడినట్లు గణాంకాలు చెపుతున్నాయని, రాష్ట్రంలో 2015,16 ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వివరించారు.
ఖచ్చితత్వమే ప్రధాన ఎజెండా
వాతావరణ శాఖ ఖచ్చితత్వంతో ప్రజలకు వాతావరణ సమాచారాన్ని అందిస్తోందని రఘవేంద్ర రాజు వెల్లడించారు. ఉపరితల వాతావరణ నివేదిక కేంద్రం(సినోప్ స్టేషన్స్) ద్వారా వాతావరణ శాఖ అధికారులు నిత్యం సమాచారం సేకరిస్తారని, దీని ద్వారా వచ్చిన డేటాను విశ్లేషించి వాతావరణాన్ని అంచనా వేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా వెయ్యికిపైగా ఈ కేంద్రాలు ఉండగా, రాష్ట్రంలో మూడు( రామగుండం, నిజామాబాద్, బేగంపేట) ప్రధాన కేంద్రాలు, 16 ఇతర కేంద్రాల నుండి నిత్యం సమాచారం సేకరిస్తామని చెప్పారు. వీటితో పాటు ఆటోమేటిక్ వెథర్ స్టేషన్ తో మనుషుల ప్రమేయం లేకుండా వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు వాటంతట అవే నమోదు చేసుకునే యంత్రాల వ్యవస్థలు ఉంటాయన్నారు.
ఇవి ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం/దిశ, తేమ, వాతావరణ పీడనం ఎప్పటికప్పుడు నమోదు చేస్తుందన్నారు. ఇవి అందించే కచ్చితమైన సమాచారం ద్వారా వాతావరణ అంచనాలు, వ్యవసాయ సలహాలు, విపత్తు నిర్వహణ సులభం అవుతుందని వివరించారు. దీంతో పాటు ఐఎండి(భారత వాతావరణ కేంద్రం)నికి అనుసంధానంగా ఉన్న జిఎఫ్‌ఎస్ (గ్లోబల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్), డబ్ల్యూఆర్‌ఎఫ్(వెథర్ రీసెర్చ్,ఫోర్‌కాస్ట్), ఇడబ్లూఆర్‌ఎఫ్(ఎలక్ట్రికల్ వెథర్ రీసెర్చ్, ఫోర్ కాస్టింగ్) లాంటి వ్యవస్థల సమాచారాన్ని క్రోడీకరించి వాతావరణ కేంద్రం ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందిస్తుందని తెలిపారు.
ఆశలన్నీ ఇండో ఓషన్ డైపోల్ మీదనే
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు త్వరగా తగ్గవని, అయితే హిందూ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పు(ఇండో ఓషన్ డైపోల్ మీదనే) ప్రకియ మీదనే రాబోయే నెలల్లో వర్షాలు ఆధారపడి ఉంటాయని రాఘవేంద్ర రాజు పేర్కొన్నారు. ఐఓడి పాజిటివ్‌లో ఉంటే వర్షాలు సమృద్ధిగా ఉంటాయని, ప్రస్తుతం ఇది తటస్థంగా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుతో ఎల్‌నినో ప్రభావం ఈ సీజన్ మెత్తం కొనసాగుతుందని, క్రమంగా వచ్చే సీజన్‌కు మాత్రమే మరే అవకాశలు ఉన్నట్లు వెల్లడించారు. ఎల్‌నినో గట్టెక్కేందుకు నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుని, ప్రభుత్వం, వాతావరణ, భూగర్భ శాస్త్ర నిపుణులు, అధికారులు సూచనలు పాటించాలని ఆయన కోరారు.











