మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ’ఎల్ నినో’ ప్రభావం రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై చూపకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హై దరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి రాష్ట్ర సం సిద్ధత వరకు’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఎల్ నినో వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన ‘స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్’ అమలు చేస్తోందని డిప్యూటీ సిఎం వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర వి ద్యుత్‌ను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో రాష్ట్రం ముందుంటుందని చెప్పారు. ఏసీలు, ఫ్యాన్లు, మోటార్ల వాడకంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సదస్సును ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.


ఎల్‌నినో గండాన్ని థర్మల్‌తో అధిగమిద్దాం

ఎల్‌నినో వాతావరణ ప్రభావం వల్ల జన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ప్రజాభవన్ లో ఇంధనశాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాతే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర పనుల్లో పురోగతి వచ్చిందన్నారు. వైటీపీఎస్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు సాధించి పనులను పరుగులు పెట్టించిందని తెలిపారు. ఒక్క ఏడాదికే అంటే 2025లోనే

మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు ఆయన చెప్పారు. 2025-26, 2026-27 సంవత్సరాల మధ్య మరో మూడు యూనిట్లు ప్రారంభించామని వివరించారు. తాము తీసుకున్న చర్యల వల్ల 2026-27 నాటికి జెన్ కో మొత్తం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి 7,180 మెగావాట్లకు చేరిందన్నారు. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2025-26లో విజయవంతంగా 27,908 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాయన్నారు.