
ఇటీవలి కాలంలో మన దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎల్‌నినో. ప్రకృతి ప్రకోపానికి ఎల్‌నినో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఒకే సమయంలో ఒక చోట కరవు, మరో చోట ముంపు నగరాలను వణికించబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో నివసించే ప్రజలు రాబోయే నీటి ఎద్దడిని తట్టుకునేలా ఇప్పటినుంచే అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితిని వివరిస్తుంది. స్పానిష్ భాషలో ఎల్‌నినో అంటే క్రైస్తవ బాలుడు అని అర్థం. డిసెంబర్ నెలలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితి ఉచ్ఛ దశకు చేరుతుంది. క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్‌లో వస్తుంది గనుక క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఎల్‌నినో అని పేరుపెట్టారు. అలాగే లానినా విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని వివరిస్తుంది. లానినో కూడా స్పానిష్ పదమే. ఆంగ్లంలో దీని అర్థం ‘ద గర్ల్’ అని. ఎల్‌నినోకు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది కనుక ఆ పేరు పెట్టారు. ఇప్పుడు వాతావరణ శాఖ వారు ఎల్‌నినో, లానినోల గురించి ఊదరగొడుతున్నారు.
ఎల్‌నినో వల్ల వర్షాలు పడవని, లానినో వల్ల క్యుములోనింబస్ మేఘాలతో కుంభవృష్టి పడుతుందని చెబుతున్నారు. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించే ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్‌నినో, లానినోలకు కారణం అవుతాయి. సముద్రంపై ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఒడిదుడుకులకు లోనవడంవల్ల ఇవి ఏర్పడతాయి. బాగా వేడిగా ఉండే దశను ఎల్‌నినో గా, చల్లగా ఉండే దశను లానినో అంటారు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వాణిజ్య పవనాలు ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుంచి పశ్చిమానికి తీసుకుపోతాయి. వాణిజ్య పవనాలు సుదీర్ఘ దూరాలు సూర్యుడి కింద ప్రయాణించడం వలన పశ్చిమ దిశకు వెళ్ళేకొద్దీ వేడెక్కుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ.
ప్రపంచ వాతావరణ గమనాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రం ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతతో రగిలిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశం ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన పొడి వాతావరణాన్ని, కరవు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. భారత వాతావరణ శాఖ సమాచారంతో ప్రకారం ఈసారి దేశంలో సాధారణం కంటే చాలా తక్కువగా, అంటే కేవలం 90% మాత్రమే రుతుపవన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కేవలం ఈశాన్య భారత ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి కొంతవరకు తప్పించుకోగలవని అంచనా. కేవలం భారత్‌లోనే కాదు.. ఆఫ్రికాలోని అడిస్ అబాబా, లాగోస్, బ్రెజిల్‌లోని రెసిఫె, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలు కూడా చుక్క వాననీటి కోసం తపించాల్సిన పరిస్థితులు రానున్నాయి.
ఎల్‌నినో ఏర్పడినప్పుడు దీనికి విరుద్ధ పరిస్థితులు ఏర్పడతాయి. పెరూ, ఈక్వడార్ దేశాల తీరంనుంచి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణ స్థితి కంటే వేడెక్కుతుంది. ఫలితంగా పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖకు సమీపంగా తూర్పునుండి పశ్చిమానికి ప్రయాణించే వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. దానితో పశ్చిమ పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తూర్పుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల అమెరికా ఖండాలలోనూ భారత ఉపఖండం లోనూ, ఈశాన్య యూరప్ లోని కొన్ని ప్రాంతాలలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. మన ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఎల్‌నినో వల్ల 2009లో జరిగినట్లుగా నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లానినో వల్ల భారత నైరుతీ రుతుపవనాలు లాభపడతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడడానికి అవకాశం ఏర్పడుతుంది. 2010లో పసిఫిక్‌లో ఏర్పడిన లానినో వల్ల ఇండియాలో నైరుతీ రుతుపవనాలు దండిగా వర్షాలు ఇచ్చాయి.
ఆస్ట్రేలియాలో అయితే ఆకాశం విరిగి నేలమీద పడినట్లుగా వర్షాలు కురిసి తీవ్రమైన ఉత్పాతాలకు దారితీసింది. భూ వాతావరణ చరిత్ర అంతా ఎల్‌నినో లానినోల మధ్య ఊగిసలాడిన చరిత్రే అని చెప్పాలి. ఎల్‌నినో రాక ఇప్పుడు ఎక్కువైందనే చెప్పాలి. లానినో నింపాదిగా వచ్చినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లానినో వల్ల కురిసే వర్షపు నీటిని ఒడిసిపడితే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులకు అవకాశం ఉండదు అంటున్నారు. ఎల్‌నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెంటిగ్రేడు పెరుగుతుంది. ఎల్‌నినోకు ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ లేదు. 2 నుండి 7 సంవత్సరాల వ్యవధిలో ఇది ఏర్పడవచ్చు. సగటు వ్యవధి 5 సంవత్సరాలు అని ఒక అంచనా. ఎల్‌నినో వ్యవధి 7 నుండి 9 నెలల వరకూ ఉంటుంది. లానినో వాతావరణం సాధారణంగా ఎల్‌నినో అనంతరం ఏర్పడతాయి. కానీ ఎల్‌నినో అనంతరం ఖచ్చితంగా లానినో ఏర్పడాలనే రూలేం లేదు. లానినో ప్రభావాలు ఎల్‌నినో ప్రభావాలకు సరిగ్గా విరుద్ధంగా ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి.
పెరిగిపోతున్న అవసరాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, వాతావరణ మార్పులు, నీటికొరత, తగ్గిపోతున్న భూకమతాల విస్తీర్ణం వ్యవసాయ రంగంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రకృతి వనరుల సమర్థ వినియోగం, అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టి జరుగుతున్నా వ్యవసాయ రంగంలో రైతుల పాత్ర తగ్గిపోతోంది. తెలంగాణలోనూ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న వారి సంఖ్య బాగా క్షీణిస్తోంది. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండవ అతి పెద్ద దేశం మనది. 2022 నాటికి వ్యవసాయరంగం వాటా బాగా తగ్గిపోనుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మోటార్ వెహికల్, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ మహిళలు, ఇతర వర్గాలకు ఇది షాకింగ్ న్యూస్ అంటున్నారు. వృత్తి నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడం వల్ల అంతగా లాభసాటిగా లేని వ్యవసాయ రంగాన్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నారు రైతులు. దేశంలో 40 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో యువత కూడా ఎక్కువగానే ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని వదిలేయడం వల్ల వారి జీవనప్రమాణాలు కూడా తగ్గిపోతాయి.
మార్కెట్లో ఆహార ధాన్యాల కొరత భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశస్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 12 శాతం ఉంది. వ్యవసాయ రంగంపై దేశవ్యాప్తంగా ఇటు ప్రత్యక్షంగా 10 కోట్ల మంది ఆధారపడుతున్నారు. పట్టణీకరణ పెరిగిపోవడం కారణంగా వ్యవసాయ రంగంపై అనాసక్తిగా ఉన్నారు వ్యవసాయదారులు. ఎల్‌నినో ఎఫెక్ట్ వ్యవసాయ రంగాన్ని కుంగదీస్తోంది. పంటల సాగు ఖరీదైంది. దీంతో రుణాలు దొరక్క వ్యవసాయ రంగాన్ని వదిలేసి ఆక్వాకల్చర్ వైపు, దాని అనుబంధ రంగాల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2025 నాటికి కోటి యాభై లక్షలమంది టెక్స్‌టైల్స్, ట్రాన్స్‌పోర్ట్, మెటల్ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఏటా 5 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కొత్త ఇండస్ట్రీలు రావడం వల్ల ఉపాధి పెరుగుతోంది. వాటిల్లో నైపుణ్యేతర రంగాలకు చెందినవారిలో ఎక్కువగా ఉపాధి పొందుతున్నది వ్యవసాయ రంగంవారే కావడం గమనార్హం.
జి.సత్యనారాయణరాజు
90308 80709











