
జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించండి
రాష్ట్రాలకు కేంద్రం పిలుపు
న్యూఢిల్లీ: ఇళ్లలో వంట కోసం ఎల్‌పిజి సిలిండర్లకు బదులుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) వాడకాన్ని వేగవంతం చేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీని కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని కేంద్రం సూచించింది. ఈ నెల 21న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ కీలక విషయాలు వెల్లడించారు. పిఎన్‌జి అనేది సురక్షితమైనది, స్వచ్ఛమైనది, పొదుపైన ఇంధనమని ఆయన పేర్కొన్నారు. ఇది దేశ ఇంధన మార్పులో కీలకపాత్ర పోషిస్తుందని, ఎల్‌పిజి సరఫరా రవాణా భారాన్ని తగ్గించి వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచుతుందని అన్నారు. ఈ సంవత్సరం మొదట్లో పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా భారతదేశ ఎల్‌పిజి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భారత్ తన ఎల్‌పిజి అవసరాల కోసం ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్ వంటి దేశాల నుండి హర్మూజ్ జలసంధి ద్వారా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ అంతరాయం వల్ల వాణిజ్య, పారిశ్రామిక ఇంధన సరఫరాపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్ తన దిగుమతులను అమెరికా, అల్జీరియాలకు విస్తరించింది. అయితే సంక్షోభ సమయంలో పైప్‌లైన్ గ్యాస్ (పిఎన్‌జి) సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. స్వదేశీ నేచురల్ గ్యాస్‌ను ఇళ్లకు అందించడం వల్ల పిఎన్‌జి వినియోగదారులు సురక్షితంగా ఉన్నారు.
కేంద్రం ఉత్తర్వుల జారీ..
ఈ వేగవంతమైన మార్పు కోసం ప్రభుత్వం నిత్యవసర వస్తువుల చట్టం 1955లోని సెక్షన్ 3 కింద నాచురల్ గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వులు 2026, ఎల్‌పిజి నియంత్రణ ఉత్తర్వులను జారీ చేసింది. ఒకే ఇంట్లో ఎల్‌పిజి, పిఎన్‌జి రెండూ ఉండడం నిషేధం కిందకు వస్తుంది. పిఎన్‌జి సదుపాయం ఉన్న చోట నోటీసు ఇచ్చినా కనెక్షన్ తీసుకోకపోతే ఎల్‌పిజి సరఫరాను నిలిపివేస్తారు. ప్రతి ప్రాంతంలో పిఎన్‌జి సమన్వయ కమిటీ (పిసిసి) ఏర్పాటు కానుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి జిల్లా సరఫరా అధికారి (డిఎస్‌ఒ) హోదాకు తగ్గకుండా ఒక నోడల్ అధికారిని నియమించి, ఈ కమిటీలతో అనుసంధానించాలని నీరజ్ మిట్టల్ రాష్ట్రాలను కోరారు.











