మన తెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్- ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐ ఎం) తన శాసనమండలి సభ్యుడు మిర్జా ర హ్మత్ బేగ్‌ను పార్టీ నుండి బహిష్కరించింది. పా ర్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఎ హుస్సేన్ అన్వర్ వెల్లడించారు. శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించాలని కూడా పార్టీ ఆదేశించింది. బహిష్కరణకు గల కారణాలను పార్టీ వెల్లడించలేదు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ బహిష్కరణ జరిగిందా..? మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో లీ క్ వివాదాన్ని క్రమశిక్షణా చర్యకు కారణమా.. అనే సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ వీడియోకు సంబంధించిన వివరాలను కాని, లీక్‌కు సంబంధించిన పరిస్థితులను కాని పార్టీ వెల్లడించలేదు. మీర్జా రహమత్ బేగ్ గురువారం ఉదయం సౌదీ అరేబియాకు వెళ్లినట్లు సమాచారం.అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పార్టీ అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జ రుగుతోంది.

అనంతరం అదే రోజు సాయం త్రం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు రప్పించినట్లు తెలుస్తోంది. ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? ఆయనను సౌ దీ నుంచి అత్యవసరంగా ఎందుకు పిలిపించా రు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక స మాధానం లేదు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రహమత్ బేగ్ మహిళలతో అసభ్యంగా పవర్తించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చినా వెంటనే చర్యలు తీసుకోకుండా ఆ వీడియా సోషల్ మీడియాలో తిరగడంతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయంపై మిర్జా స్పందించాల్సి ఉంది. పార్టీ ఆదేశానుసారం అయన శాసన మండలి స్థానానికి రాజీ నామాచేస్తారా అనేది వేచిచూడాల్సిందే. కాగా రెండు రోజుల క్రితం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అనే తేడా లేకుండా తప్పు చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


ఆ వ్యాఖ్యల తర్వాతే రహ్మత్ బేగ్ బహిష్కరణ వేటు పడడం విశేషం. అత్తాపూర్ పరిధిలో మిర్జా రహ్మత్ బేగ్ ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా కొందరు యువకులు పట్టుకుని, దేహశుద్ధి చేసి వీడియోలు తీశారని పాతబస్తీకి చెందిన జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ ఆరోపించారు. ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలిసినా, మొదట రహ్మత్ బేగ్‌ను ఉమ్రా యాత్రకు పంపించారని, ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని సబ్దర్ అలీ విమర్శించారు. మరోవైపు, హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ చేసిన అకృత్యాల నిజస్వరూపం నగరం మొత్తానికి తెలియాలని, అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా నోరు విప్పి రహ్మత్ బేగ్‌ను ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంఐఎంకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక కార్పొరేటర్ పాత్ర కూడా ఉందనే ఆధారాలు తన వద్ద ఉన్నాయని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.