
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసు జారీ చేసింది. 5వ తేదీ (శనివారం) సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశమై నోటీసు జారీ చేసి వివరణ తీసుకోవాలని నిర్ణయించినందున ఈ మేరకు నోటీసు పంపించారు. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వ తేదీన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సహచర ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైపు చేతులతోనే తుపాకిలా గురి పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీతో సహ మిగతా పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సదరు సభ్యునిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పట్టుపట్టగా బిఆర్‌ఎస్ సభ్యులు
తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభను స్తంభింపజేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని సభ నిర్ణయించింది. ఆ సమయంలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు కాలేదు. తాజాగా ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా రేవూరి ప్రకాష్ రెడ్డిని నియమిస్తూ మిగతా పార్టీల నుంచీ సభ్యులను స్పీకర్ నియమించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సిందిగా కమిటీ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. పాడి ఇచ్చే వివరణపై కమిటీ సమావేశమై చర్చిస్తుంది. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సమయం తక్కువగా ఉన్నందున ఈ సమావేశాల్లోనే ఎథిక్స్ కమిటీ నివేదికను స్పీకర్‌కు అందజేయడం, దానిని స్పీకర్ సభలో ప్రతిపాదించడం సాధ్యం అవుతుందా? అని అన్ని పార్టీల ఎమ్మెల్యేల భావిస్తున్నారు.








