బిజెపి ఎంపి కంగనా రనౌత్ దిష్టిబొమ్మను పోలీసు అధికారి పట్టుకుని పరుగెత్తిన  సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది. కంగనా రనౌత్ యువతను, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా లక్నోలోని మాల్ అవెన్యూ కూడలి వద్ద ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వారు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. నిరసనకారులు దిష్టిబొమ్మకు నిప్పు అంటించారు.అయితే అక్కడ విధుల్లో ఉన్న పోలీసు ఇన్‌స్పెక్టర్ ఒకరు  వెంటనే అప్రమత్తమై వారి చేతుల్లోంచి లాక్కొని దానిని పట్టుకుని రోడ్డుపై వేగంగా పరుగెత్తారు.కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆయన వెనుక పరుగెడుతూ నినాదాలు చేసినప్పటికీ  పోలీస్ అధికారి ఆ దిష్టిబొమ్మతో సహా దూరంగా వెళ్ళిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.