చండీగఢ్ /న్యూఢిల్లీ : పంజాబ్‌లో రాజ్యసభ ఎంపి సందీప్ పాఠక్‌పై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇటీవలే ఆప్ నుంచి బిజెపిలోకి పార్టీ ఫిరాయించిన ఈ ఎంపిపై రెండు ఎఫ్‌ఐఆర్‌ల దాఖలు కావడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. పోలీసులు ఈ ఎంపిపై బెయిల్‌కు వీల్లేని నిబంధనల మేరకు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అయితే ఆయనపై ఎందుకు వీటిని దాఖలు చేశారనేది పోలీసులు వెల్లడించలేదు.శనివారం ఉదయం ఈ ఎంపి నివాసంపై దాడులు జరుగుతాయని తెలిసిన దశలోనే ఈ ఎంపి వెనుక గేటు నుంచి కారులో బయటకు వెళ్లారు. తరువాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయి ఉంది.

పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆయన రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇటీవలే ఆప్ ఎంపిలు ఏడుగురు పార్టీ వీడి బిజెపిలో చేరారు. వీరి పార్టీ విలీనం అధికారికంగా రాజ్యసభ సచివాలయం ధృవీకరించింది. ఇప్పుడు బిజెపి ఎంపిలుగా చలామణిలోకి వచ్చే ఈ ఎంపిలలో పాఠక్ కూడా ఉన్నారు. పాఠక్‌పై ఎఫ్‌ఐఆర్‌ల దాఖలును బిజెపి ఖండించింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రాబల్యం తగ్గుతూ ఉండటంతో ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బిజెపి మండిపడింది.

పంజాబ్ పోలీసును ఆప్ నాయకత్వం వాడుకొంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, దీనిని పట్టించుకోకుండా పోలీసు వర్గాలు ఆప్ నాయకత్వం కనుసన్నల్లో నడుస్తోందని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తెలిపారు, ఇక్కడి పోలీసులకు ప్రాదాన్యతా క్రమాల పట్టింపు లేదని మండిపడ్డారు. పంజాబ్ పోలీసు బృందాలు పాఠక్ నివాసానికి వెళ్లాయి. సోదాలకు యత్నించారని విమర్శించారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది, యువతపై ప్రభావం పడుతోంది. దీనిని కట్టడి చేయాల్సిన పోలీసులు ఆప్ ప్రభుత్వం అదుపాజ్ఞలలో పనిచేస్తోందని బిజెపి విమర్శించింది వినూత్న రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తామని చెపుతూ వస్తున్న కేజ్రీవాల్, ముఖ్యమంత్రి మాన్ ఇప్పుడు ఇక్కడ సాగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలపై వివరణ ఇచ్చుకుని తీరాలని బిజెపి డిమాండ్ చేసింది.