
ఆప్ నుంచి బిజెపిలోనికి పార్టీ ఫిరాయించిన ఎంపి రాఘవ ఛద్దాకు సోషల్ మీడియా పరంగా షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ఇతర ఎంపీలను కూడా తీసుకుని బిజెపిలోకి వెళ్లిన మరుసటి రోజే ఈ యువ ఎంపి ఇన్‌స్టా ఫాలోయర్స్ 24 గంటల్లోనే పదిలక్షల మేర తగ్గారు. దీనికి కారణం ఎప్పటికప్పుడు అందరి సోషల్ మీడియా పోస్టింగ్‌లను విశేషంగా చూసే నవయువ జనం ఈ ఎంపి రాజకీయ చేష్టను ఇష్టపడలేదని నిర్థారణ అయింది. సభలలో తరచూ రాజకీయ విలువల గురించి చెపుతూ వచ్చే రాఘవకు ఈ యువతరం అయిన జన్ జడ్ నుంచి ఇంతకాలం విశేష స్పందన ఉంది. పార్టీ మారకముందు ఆయనకు ఉన్న ఇన్‌స్టా అభిమానుల సంఖ్య 14.6 మిలియన్లు, ఇది శుక్రవారం మధ్యాహ్నం లెక్క.
అయితే ఇప్పుడు శనివారం ఈ ఫాలోవర్స్ సంఖ్యాబలం 13.5 మిలియన్లకు పడిపోయింది. రాఘవ చర్యను యువతరం ఇష్టపడలేదని ఇప్పటి పరిణామంతో వెల్లడైంది. ఆప్ నుంచి బిజెపిలోనికి దూకిన ఈ ఎంపికి తగ్గిన పాలోవర్స్ విషయంపై తరచూ సామాజిక మాధ్యమంలో ఉండే ఎన్‌సిపి ఎస్‌పి అధికార ప్రతినిధి అనిష్ గావాన్డే స్పందించారు. ఇంటర్నెట్ రెండంచుల పదునైన కత్తి, రాత్రికి రాత్రి ఎవరిని అయినా హీరోను చేస్తుంది. అవసరం అయితే అదే వ్యక్తిని మరుసటి రోజుకు జీరోగా కిందపడేస్తుందని చమత్కరించారు. అక్కడెక్కడనో కాదు ఇక్కడ కూడా జన్ జడ్ ప్రతి నేతను తన నెట్ కన్నేసి చూస్తోందని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.











