
నాగపూర్: ఎన్నికల్లో కాక్రోచ్ జనతా పార్టీ పోటీ చేయబోదని, ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్‌గ్రాడ్యుయేట్ బాధితులైన విద్యార్థులకు ప్రధాని మోడీ భరోసా ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాగపూర్‌లో నిరసన నిర్వహించనున్న సందర్భంగా దిప్కే పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? అన్న ప్రశ్నకు అభిజీత్ దిప్కే స్పందించారు. “ ఎందుకు మేం ఎన్నికల్లో పోటీ చేయాలి ? తమ డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేస్తే... అదెలా పనిచేస్తుంది ? ” అని వ్యాఖ్యానించారు.
దేశంలోని యువతను ఉద్దేశించి ప్రధాని మోడీ పేపర్ లీక్‌లు మళ్లీ సంభవించవని హామీ ఇవ్వాలా ? అన్న ప్రశ్నకు మే 3న జరగాల్సిన నీట్‌యుజి పరీక్షలు రద్దవడంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఐదారు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోడీ మొదట తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. “ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ప్రధాని మోడీ స్పందించి ట్వీట్ చేస్తారు. కానీ ఇక్కడ మన దేశంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం సానుభూతిగా ఓదార్చే ట్వీట్ ప్రధాని నుంచి రాలేదు. ఎంతకాలం “మన్‌కీబాత్ , పరీక్ష పె చర్చ” మాట్లాడుతారు. కనీసం విద్యార్థుల “ మన్‌కీబాత్ ” అయినా వినండి” అని దిప్కే ఘాటుగా ధ్వజమెత్తారు. విద్యార్థులతో ప్రధాని మమేకమైతే ఆయన వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు కనుగొన గలుగుతారని అభిజీత్ దిప్కే సూచించారు. కేంద్ర విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా చేసేవరకు దేశ వ్యాప్త నిరసన ఆగబోదని పేర్కొన్నారు.











