మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదయింది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో తిరుపతిలో తొలి కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా, జూలై 23న నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.

శనివారం ఒక్కరోజే ఎపిలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగుచూడగా, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.