
దేశంలో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు పార్లమెంటులో ‘ప్రజా పరీక్షల (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతించారు. ఈ సంస్కరణలు పరీక్షలకే పరిమితం కాకుండా మొత్తం విద్యావ్యవస్థలోనూ మార్పులకు దారితీయాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లద్దాఖ్‌కు వెళ్తున్న సమయంలో వాంగ్‌చుక్ ‘ఎక్స్’లో ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వందేభారత్ రైలులో ప్రయాణించినట్లు తెలిపారు. చెనాబ్ రైలు వంతెన మీదుగా సాగిన ప్రయాణం ఎంతో అందమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. “భారతీయ రైల్వేలను చూసి ఎంతో గర్వపడుతున్నాను” అని పేర్కొన్నారు. తన బృందంతో కలిసి కశ్మీర్‌లో ఒక రోజు గడిపిన అనంతరం లద్దాఖ్‌కు వెళ్తామని తెలిపారు. పరీక్షల వ్యవస్థను మెరుగుపరిచేందుకు పార్లమెంటులో బిల్లు తీసుకురావడం సంతోషంగా ఉందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. “సంస్కరణలు పరీక్షల్లోనే కాకుండా విద్యావ్యవస్థలోనూ వస్తాయని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ఆందోళన ముగిసిన అనంతరం తనకు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని వాంగ్‌చుక్ కోరారు. “మొదట నాకు లిఖితపూర్వకంగా, ఆ తర్వాత సీజేపీకి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని తెలిపింది. ప్రభుత్వం ఆ హామీలకు కట్టుబడి వాటిని అమలు చేయాలి. దేశంలో, ముఖ్యంగా యువతలో నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలి” అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి, యువతకు మధ్య పరస్పర విశ్వాసం ఉండటం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గొప్ప దేశాన్ని, గొప్ప భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ నమ్మకం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని సీజేపీ పదేపదే డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఉపసంహరించుకుంటామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కూడా కోరుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనలు ప్రారంభించే అవకాశం ఉందని హెచ్చరించింది.











