అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. లెక్కింపు విదానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయ కానుకల లెక్కింపు బాధ్యతలను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనుంది. విరాళాల లెక్కింపు మొత్తం నిపుణులైన ఎస్‌బిఐ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో, పూర్తి భద్రత నడుమ జరుగుతుందని వెల్లడించింది. పెరిగిపోతున్న కానుకల నిల్వలను దృష్టిలో ఉంచుకుని, రోజుకు 12 గంటల పాటు లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. ఈ 12 గంటల లెక్కింపు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించినట్లు తెలిపారు. పకడ్బందీగా ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.