అమరావతి: తన భార్య తనని చంపేస్తానని బెదిరిస్తోందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని భర్త పిజిఆర్‌ఎస్‌ సమావేశంలో అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలోని పాడా కార్యాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బల్లిపాటి శివాజీ అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం దుర్గ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టివి మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2024లో శివాజీకి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో నడిచే పరిస్థితి లేదు. కాలు పని చేయకపోవడంతో పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భర్తను వేధించడంతో పాటు పలుమార్లు కొట్టడం, అన్నంలో పురుగుల మందు పెట్టి చంపేస్తానని పలుమార్లు భార్య బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. పాడా కార్యాలయంలో జరుగుతున్న పిజిఆర్‌ఎస్ సమావేశంతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తనని వేధిస్తోందని, కుమారుడిని ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు తనపై కేసు పెడుతానని భయపెడుతోందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను శివాజీ కోరాడు.