
మహబూబ్ నగర్: గద్వాల్ జిల్లా ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై కోదండాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వోల్వో బస్సు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆరుగురికి తీవ్రంగా గాయపడగా ఒకరికి కాలు విరిగింది. మరికొంతమంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.










