
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారిగా భూస్థిర కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించే అధునాతన ఉపగ్రహం ఈఓఎస్- 05ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ఖచ్చితంగా చేర్చింది. ‘ఆకాశంలో కన్ను’గా ఇస్రో శాస్త్రవేత్తలు అభివర్ణించిన ఈ ఉపగ్రహం దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో పనిచేయనుంది. అక్కడి నుంచి దాదాపు రియల్‌టైమ్‌లో భూభాగాల చిత్రాలను అందించనుంది. వ్యవసాయం, విపత్తుల నిర్వహణతో పాటు దేశానికి అవసరమైన వ్యూహాత్మక సమాచారాన్ని అందించడంలో ఇది కీలకంగా మారనుంది.శుక్రవారం ఉదయం 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రయోగం సజావుగా సాగింది.రాకెట్ ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఈఓఎస్- 05ను నిర్దేశిత సబ్- జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
“జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగ వాహనం అధునాతన ఈఓఎస్- 05 భూచిత్రీకరణ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టింది.ఈ విజయాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది” అని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు కూడా విజయవంతంగా విచ్చుకున్నాయని వెల్లడించారు. “శ్రీహరికోట నుంచి ఇది 107వ ప్రయోగం కాగా, జీఎస్‌ఎల్‌వీకి ఇది 19వ ప్రయోగం. 2, 367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టాం” అని అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్ చెప్పారు. జీఎస్‌ఎల్‌వీ తొలి ప్రయోగంలో 1,536 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాకెట్ సామర్థ్యాన్ని దశలవారీగా పెంచుతూ ఇస్రో సాధించిన పురోగతికి తాజా ప్రయోగం నిదర్శనమన్నారు. ఈఓఎస్ -05ను తుది భూస్థిర కక్ష్యలోకి చేర్చేందుకు రానున్న రోజుల్లో కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తయ్యాక దేశ అవసరాల కోసం భూస్థిర కక్ష్య నుంచి ప్రత్యేకంగా చిత్రాలను అందించే తొలి భారత ఉపగ్రహంగా ఈఓఎస్ -05 నిలవనుంది. ఈఓఎస్ -05ను ‘స్పై శాటిలైట్’గా పేర్కొంటూ వస్తున్న ఊహాగానాలను ఇస్రో తోసిపుచ్చింది.
ఇది అధునాతన భూ పరిశీలన, చిత్రీకరణ ఉపగ్రహమని స్పష్టం చేసింది. బహుళ బ్యాండ్‌లలో పనిచేసే సామర్థ్యం దీనికి ఉందని, అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం, సామర్థ్యాలతో రూపొందించిన ప్రత్యేక ఉపగ్రహమని ప్రాజెక్టు డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మాట్లాడుతూ.. ఈ ఉపగ్రహం దాదాపు రియల్‌టైమ్‌లో చిత్రాలను అందించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. జీఎస్‌ఎల్‌వీ ద్వారా జీటీఓ లేదా సబ్-జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాటిలో ఇదే అత్యంత బరువైన ఉపగ్రహమని చెప్పారు. 2021లో విఫలమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10/ఈఓఎస్-03 ప్రయోగానికి ఈ తాజా మిషన్ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అప్పట్లో ప్రయోగం జరిగిన 307 సెకన్లకు క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌లో తలెత్తిన సమస్య కారణంగా రాకెట్ ప్రయాణాన్ని ఆపివేసింది. ఆ వైఫల్యానికి క్రయోజెనిక్ దశలో ఏర్పడిన లోపమే కారణమని ప్రయోగానంతర సమాచారంపై జరిపిన దర్యాప్తులో తేలింది. ఈ ఏడాదిలో ఇస్రోకు ఇది తొలి విజయవంతమైన ప్రయోగం.
జనవరి 12న 16 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ కీలకమైన మూడో దశలో తలెత్తిన సమస్యతో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు లభించిన ఈ విజయం శాస్త్రవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రయోగం సమయంలో వర్షం కురుస్తున్నా, తెల్లవారుజాము సమయం అయినప్పటికీ ప్రజల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. గొడుగులు పట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారు ప్రయోగాన్ని వీక్షిస్తూ హర్షధ్వానాలు చేశారు. 51.7 మీటర్ల ఎత్తున్న మూడు దశల జీఎస్‌ఎల్‌వీ రాకెట్ మొత్తం 420.5 టన్నుల బరువుతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో మూడో దశ క్రయోజెనిక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈఓఎస్-05 ఉపగ్రహం తొమ్మిదేళ్ల పాటు పనిచేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మిషన్ విజయానికి ముందు నారాయణన్ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.











