మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం సహా రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఐటిడిఎల పరిధిలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో, దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా దూరాన్ని బట్టి హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తామని, అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలను మంజూరు చేస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా హాస్పిటళ్లలను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎంఎల్‌ఎలు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎంఎల్‌ఎ కోరం కనుకయ్య, అశ్వరావుపేట ఎంఎల్‌ఎ జారె ఆదినారాయణ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదు అన్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలోనే ఐటీడీఏ పీవోలతో సమావేశం నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ మంజూరు చేశామన్నారు. సీహెచ్‌సిలు, ఏరియా హాస్పిటల్స్‌కు అనుబంధంగా అంబులెన్స్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 7 డయాలసిస్ సెంటర్లు ఉండగా, కొత్తగా మరో 4 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

కేవలం 20 నిమిషాల ప్రయాణంతో పేషెంట్ డయాలసిస్ సెంటర్‌‌కు చేరుకునేలా డయాలసిస్ నెట్‌వర్క్‌ను విస్తరించామని తెలిపారు. భద్రాచలం, అశ్వరావుపేట, ఎల్లందు సహా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామి ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోరినట్టుగా కొత్తగూడెం సహా అటవీ ప్రాంతాల్లో ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు. కొమురారం హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ఎల్లందు హాస్పిటల్‌లో కొత్త ఐసీయూను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.