హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి నది  ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక జాలర్లు పడవల్లో అక్కడికి చేరుకున్నారు. స్థానిక సిఐ, ఎస్ఐ తన సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వీరాపురంలో ఇసుక పాయల్లోకి వరద నీరు చేరుకోగానే లారీ డ్రైవర్లు, కూలీలు భయటకు వచ్చేశారు. ఇప్పుడు చిక్కుకున్న వారిలో 30 మంది డ్రైవర్లు, కూలీలు ఉన్నట్టు సమాచారం.

 మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురవడంతో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాల కురవడంతో గోదావరి, ప్రాణహిత నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం దగ్గర 11 మీటర్ల ఎత్తుకు ప్రవాహం చేరుకోగా 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరదం ప్రవాహం ముంచెత్తగా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5 లక్షల 66 వేల క్యూసెక్కులుగా ఉంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.