అకస్మాత్తుగా పెరిగిన గోదావరి వరద ఉధృతి వల్ల ఇసుక ర్యాంప్‌లో పనిచేసే కూలీలు ప్రమాద బారినపడటంతో వారిని రక్షించడానికి మండల అధికార యంత్రాంగం అంతా సంఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షించడానికి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఎగువ ప్రాంతంలోని వరద ఉధృతి పెరగడంతో గోదావరి నది పొంగింది. శుక్రవారం ఉదయం గోదావరి వరద ఉధృతి తీవ్రం కావడంతో మండల పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతం వీరాపురం వద్ద ఇసుక రాంప్‌ల్లో పనిచేసే కూలీలు నది మధ్యలో చిక్కుకొని తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అనుకోని సంఘటనతో గోదావరి నదిలో చిక్కుకున్న కూలీల కుటుంబ సభ్యులు ఒడ్డున చేరి తమ వారిని రక్షించాలంటూ పలువురిని వేడుకొన్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఈదయ్య, సీఐ రాజువర్మ, ఎస్సై ఆర్.నర్సిరెడ్డి తమ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని గోదావరి నది మధ్యలో చిక్కుకున్న 30 మంది కూలీలు,

ఎనిమిది మంది లారీ డ్రైవర్లను రక్షించడానికి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. బాధితులను రక్షించేందుకు చర్ల సీఐ రాజు వర్మ, ఎస్సై.ఆర్ నర్సిరెడ్డి తెప్పపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తెప్ప తిరగబడటంతో సీఐ రాజు వర్మ, ఎస్సై ఆర్.నర్సిరెడ్డి భారీ ప్రమాదానికి గురయ్యారు.క్షణాల్లోనే తేరుకున్న సీఐ, ఎస్‌ఐలు గోదావరిలో ఈదుకుంటూ బాధితుల వద్దకు చేరుకొని బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనతో పరిసర గ్రామాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఐ రాజువర్మ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి, తమ కుటుంబసభ్యులను రక్షించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ గంట గంటకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ, మరోవైపు గోదావరిలో చిక్కుకున్న బాధితులను రక్షించిన సీఐ రాజువర్మ, ఆయన సిబ్బందిని, మండల అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు.