ఆకలితో అలమటిస్తున్న శిశువులు, గోపత్య కరవైన తల్లులు, గర్భిణీలు

నేపాల్ వరదలతో రద్దీగా మారిన ఆశ్రయ కేంద్రాలు

క్లిష్టంగా మారుతున్న ప్రసూతి వైద్యం

రుతుక్రమంలో ఉన్న బాలికలకు శానిటరీ ప్యాడ్ల కొరత

ఖాట్మండూ: నేపాల్‌ను అతలాకుతులం చేసిన మెరుపు వరదలు వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. నివాసాలు కోల్పోయి, తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపాల్ తల్లుల కష్టాలు ఇంతింత కాదన్నట్టు అత్యంత దయనీయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డలకు ఇస్తుండటం, తల్లిపాలు లేక ఆకలితో అలమటిస్తున్న శిశువుల రోదనలు, గర్భిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ గోప్యతకు నోచుకోని అనేక మంది పరిస్థితి కలిచివేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.

నేపాల్ వరదల్లో శర్మిలా శ్రేష్ట నివాసం కొట్టుకుపోయింది. కొన్ని రోజుల తర్వాత తన చిన్నారిని తిరిగి కలుసుకుంది. రద్దీగా ఉన్న ఓ ఆశ్రయంలో ప్రస్తుతం చిన్నారితో ఉంటోంది. అయితే అక్కడ పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే పసిబిడ్డ తినడం చూస్తూ నిస్సహాయంగా కంటతడి పెడుతోంది. చిన్నారులకు ప్రత్యేక ఆహారం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. 14 నెలలున్న ఆమె కుమార్తె వాయవ్య ఖాట్మండూలోని ఓ పాఠశాల గదిలో నేలపైనే తల్లితో కలిసి నిద్రిస్తోంది. అదే గదిలో ఆమె వదినకు చెందిన 18 నెలల కుమారుడు కూడా ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలకూ బేబీ ఫుడ్ అందడం లేదు. ‘నాకు ఇప్పుడు తలదాచుకునే గూడు ఉంటే కొంతైనా మనశ్సాంతి కలుగుతుంది’ అని శ్రేష్ట చెబుతోంది. ఆమె వంటి ఎందరో తల్లులు ఈ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నారు. వందలాది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. గోప్యత లేక తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. బోటేకోశి-త్రిశూలి మార్గంలో ఉన్న ఓ అశ్రయ కేంద్రంలో చేరిన పారియర్ అనే మహిళ దీనిపై మాట్లాడుతూ, మూడు నెలలుగా పాపకు తల్లిపాలు ఇస్తున్నాననీ, ఇక్కడ డజన్ల కొద్దీ అపరిచితులు, సిగరెట్ పొగ, మద్యం వాసన మధ్య బతకాల్సి వస్తోందని వాపోయింది. బిడ్డకు నిద్ర కరవైందని తెలిపింది. వరదల తర్వాత తల్లిపాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని, ఫార్మూలా పాలు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ బిడ్డ కడుపు నిండుతున్నట్టు కనిపించడం లేదని తెలిపింది. రసువా, సువాకోట్, దాదింగ్ జిల్లాల్లో వేలాది మంది మహిళలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు.

మరోవైపు గర్భిణులు ఏదైనా సమస్య తలెత్తితే ఆసుపత్రికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ జిల్లాల్లోని 15 మున్సిపాలిటీల్లో సుమారు 4,430 మంది గర్భిణులు ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పిఎ) అంచనా వేసింది. వచ్చే నెలలో సుమారు 492 ప్రసవాలు జరిగే అవకాశం ఉండగా, 74 మందికి అత్యవసర ప్రసూతి వైద్యం అవసరం కావచ్చని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈ గర్భిణీ స్త్రీలు అవసరమైన సమయంలో వైద్య సహాయం పొందగలరా అనేదే అసలు సమస్యగా మారినట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి సేవలందించే జిల్లా స్థాయి ఆసుపత్రి త్రిశూలిలో ఉండగా, వరదల తర్వాత తొమ్మిది ప్రసవాలు జరిగాయి. ఇదే సమయంలో జ్వరం, గర్భస్థ శిశువు కదలికలు తగ్గడం, మూత్రనాళాల ఇన్పెక్షన్‌తో గర్భిణులు ఆసుపత్రికి వస్తూనే ఉన్నారు.

విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో జనరేటర్ ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు ఈ ఆసుపత్రిలో అధునాతన నియోనేటల్ యూనిట్ కూడా లేదు. మరో వైపు రుతుక్రమంలో ఉన్న బాలికలకు తగినన్ని శానిటరీ ప్యాడ్లు కూడా అందుబాటులో లేవని, ఒకసారి పంపిణీ చేసినప్పుడు ఒక్కో మహిళకు ఒక ప్యాడ్ మాత్రమే ఇచ్చి దాన్ని మూడు, నాలుగు రోజులు ఉపయోగించాలని చెప్పారని డబ్ల్యూఓఆర్‌ఈసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్ రేఖా శ్రేష్ట తెలిపారు. గర్భిణులు, ప్రసవం అనంతరం ఉన్న తల్లులకు ప్రత్యేక అవసరాలు ఉంటాయని, బిడ్డకు పాలు ఇవ్వాడానికి ప్రైవేటు స్థలం లేదని చెప్పారు. విపత్తు సహాయక చర్యల్లో గోప్యత అనేది అదనపు సౌకర్యం కాదని, అదొక అవసరమని చెప్పారు. తమ సంస్థ మహిళలకు అవసరమైన ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నేపాల్‌లో వరదలు సృష్టించిన బీభత్సం ఆదివారం నాటికి 12వ రోజుకు చేరుకోగా, మృతుల సంఖ్య 1,344కు చేరింది. 5,000 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు.